కేరళలో జరిగిన ఆర్ఎస్ఎస్ విద్యా సమ్మేళనం పట్ల మా వైఖరి — విద్యను హిందూత్వ ఫాసిజం యొక్క వ్యూహాత్మక భావజాల-రాజకీయ ఆయుధంగా మార్చే కుట్ర!
(ఆగస్టు 2025 రెడ్ స్టార్ సంపాదకీయం)
గోల్వాల్కర్ తన రచనలైన “We or Our Nationhood Defined” (మనంలేదా మన జాతీయత నిర్వచనం)(1939) మరియు “Bunch of Thoughts” తెలుగులో “పాంచ జన్యం” పేరుతో అనువాదం చేయబడింది(1966) లలో “సాంస్కృతిక జాతీయత” అంటే హిందూత్వ జాతీయత అని, దానిలో కూడా కులవ్యవస్థే కీలకమని స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత కాలం నడుస్తున్న ఫాసిస్టు సంస్థ అయిన ఆర్ఎస్ఎస్, తన రాజకీయ సాధనమైన బిజెపి ద్వారా విద్యను ఒక వ్యూహాత్మక భావజాల-రాజకీయ ఆయుధంగా మారుస్తూ, మెజార్టీరియనిజం ఆధారిత మనువాద హిందూ రాష్ట్రము దిశగా వేగంగా అడుగులు వేస్తోన్నది. ఈ దిశగా మొదటి చర్యగా, యూజీసీ, ఎన్సీఈఆర్టీ, నాక్, ఐసిఎచ్ఆర్ వంటి అగ్రస్థాయి విద్యా సంస్థలలో హిందూత్వ వాదుల్ని నియమించారు. అనంతరం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యావ్యవస్థ దాకా అన్నింటినీ మార్చేందుకు నూతన విద్యా విధానం (NEP) రూపకల్పన చేశారు.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన విద్యా భారతీ, శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్, భారతీయ శిక్షణ మండల్, భారతీయ భాషా మండల్, స్వదేశీ జాగరణ మంచ్ మొదలైన సంస్థల సిఫార్సులతో పాటు, నీతి ఆయోగ్, సీఐఐ లాంటి ప్రో-కార్పొరేట్ థింక్ ట్యాంక్( నిర్దిష్ట సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక సమస్యలు లేదా సమస్యలపై సలహాలు, సూచనలు మరియు ఆలోచనలను అందించడానికి నిపుణుల బృందం తో కూడుకొని ఉన్న కలిపి)
ల సలహాలు కలిపి NEP రూపుదిద్దుకుంది. ఎటువంటి పార్లమెంట్ చర్చ లేకుండా, 2020 జూలై 29న మోదీ క్యాబినెట్ దీనిని ఆమోదించింది. 1968, 1986 విద్యా విధానాల్లో ఉన్న లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచన, ఫెడరలిజం వంటి విలువల్ని పూర్తిగా తొలగించి, విద్యను గోధూమీకరణ (సంఘపరచడం) మరియు కార్పొరేటీకరణ దిశగా మలిచారు. దీనికి అనుగుణంగా, పాఠ్యపుస్తకాల్లో మార్పులు, విద్యా సంస్థల మూల స్వభావంలో మార్పులు చేర్చే కార్యాచరణ కూడా NEPలో భాగమయ్యాయి.
ఈ NEP పరిణామాల నేపథ్యంలో, 2019లో మోదీ తిరిగి ప్రధానిగా వచ్చిన తరువాత, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యా సంస్థలతో దేశవ్యాప్తంగా “ఎడ్యుకేషన్ కాంక్లేవ్ (విద్యా సమావేశం)”లను నిర్వహించడం ప్రారంభించింది. 2025 జూలై 25-28 మధ్య కోచ్చిలో జరిగిన నాలుగు రోజుల “జ్ఞాన సభ” కూడా ఇందులో భాగమే. ఇది “విద్యను భారతీయంగా మారుస్తాం” (అంటే హిందూత్వీకరణ) మరియు “వికసిత్ భారత్ కోసం విద్య” (అంటే కార్పొరేట్ విద్య) అనే రెండు లక్ష్యాలతో జరిగింది. ఇది ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా జరిగింది. ఇందులో ఆరంభ, ముగింపు సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో, కేరళ గవర్నర్తో పాటు వైస్ ఛాన్సలర్లు, విద్యా నిపుణులు, ఆర్ఎస్ఎస్ క్యాడర్ పాల్గొన్న కార్యక్రమంలో, “భారతదేశం” అనే పదం మాత్రమే ఉండాలని, “ఇండియా” అనే పదాన్ని భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 నుండి తొలగించాలన్న దేశవ్యాప్త సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించాలని మోహన్ భగవత్ స్వయంగా ప్రకటించారు.
1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలు చరిత్రలో నమోదై ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే లక్ష్యాన్ని ఒక్కసారిగా కాకుండా, 2014 తరువాత ఉన్నతస్థాయి రాజ్యాంగ సవరణలు, చట్ట, పరిపాలన మార్పుల ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యరూపం దాల్చుతోంది. విద్యను ఈ లక్ష్యం నెరవేర్చేందుకు అత్యంత ప్రభావవంతమైన ఆయుధంగా మలుస్తోన్నది. ఉదాహరణకు, గోల్వాల్కర్ ముస్లింలను దేశ శత్రువులుగా లక్ష్యంగా చూపిన దిశగా, NEP ద్వారా భారతదేశ ముస్లింల పాలనలో ఉన్న చారిత్రక గౌరవకర సంప్రదాయాలను పూర్తిగా తొలగించి, చరిత్రను వక్రీకరించి రాశారు. దాని స్థానంలో బ్రాహ్మణీయ-మనువాద మూఢనమ్మకాలు, అసంభావిత శాస్త్రం, మూల్యాలను ప్రోత్సహిస్తున్నారు, ఇవన్నీ దళితులు, మహిళలు, ఆదివాసీలను హీనమైనదిగా చూడటమే లక్ష్యంగా ఉన్నాయి. రాజ్యాంగంలో నిర్దేశించిన ఎస్సీ/ఎస్టీ హక్కుల విషయంలో, NEPలో రెండు సందర్భాలు తప్ప సరిగ్గా ఎక్కడా ప్రస్తావన లేదు.
దీనితో పాటు, దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థ అయిన విద్యాభారతీ (1.2 కోట్ల మంది విద్యార్థులు, 12 వేల పాఠశాలలు) ఆధిపత్యం క్రింద, NEPలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP మోడల్)ను ప్రవేశపెట్టారు. కార్పొరేట్లతో కలిసి విద్యా రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ఉదాహరణగా, ఆదానీ సంస్థ ₹2000 కోట్లను విద్యా PPP ప్రాజెక్టుల కోసం కేటాయించింది. ఈ విధానాన్ని మిలిటరీ రంగానికి కూడా విస్తరించి, దేశవ్యాప్తంగా 100 మిలిటరీ పాఠశాలలు ప్రారంభించారు, వీటిలో చాలా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల అధీనంలో ఉన్నాయి. నాసిక్ లో 1937లో స్థాపించిన భోన్సాలా మిలిటరీ స్కూల్ ద్వారా విద్య రంగంలో ఆర్ఎస్ఎస్ మొదటి ప్రవేశం చేసింది.
ఈ కథనంలో NEPకు సంబంధించి లోతైన విశ్లేషణ ఇవ్వడం ఉద్దేశ్యం కాదు. కానీ ఈ సమ్మేళనాల రాజకీయ-భావజాల ఉద్దేశ్యాలను ప్రస్తావించడం ప్రధాన ఉద్దేశ్యం. “డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల”లో (ఉదాహరణకు ఉత్తరాఖండ్), ప్రభుత్వం నిధులతో నడిచే పాఠశాలల్లో కూడా గీతా పారాయణ, హిందూత్వ ఆచారాలు ప్రదర్శించబడుతున్నాయి. సంస్కృతానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించబడుతున్న సమయంలో, మాతృభాషల విద్య, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా హక్కులు కోల్పోతున్నాయి. ఎస్సీ/ఎస్టీ కోసం రాజ్యాంగం ఇచ్చిన హామీలు, ఆర్థిక వెసులుబాట్లు కూడా క్రమంగా తగ్గించబడుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ పేరిట, సాధారణ విద్యను అనౌపచారికంగా మార్చి, కార్పొరేట్ కూలీలుగా విద్యార్థులను ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోంది. బహుభాషా, బహుళ సంస్కృతీ, బహుళ జాతీయం, బహుళ మతాల కలగలుపు ఉన్న భారతదేశంలో హిందూత్వాన్ని ఏకఘటితంగా రుద్దే ప్రయత్నాలు పూర్ణ ఉత్సాహంతో జరుగుతున్నాయి. అందుకే, లౌకిక, ప్రజాస్వామ్య, శాస్త్రీయ, ప్రజావాద విద్య కోసం పోరాటం — రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ ఫాసిజం పట్ల విశాలమైన, దీర్ఘకాలికమైన, అంతరాంతర పోరాటంలో భాగంగా మారాలి.
పిజే జేమ్స్, ప్రధాన కార్యదర్శి ,సిపిఐ (ఎమ్.ఎల్) స్టార్.
తెలుగు స్వేచ్ఛానుసారణ: కొల్లిపర వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యులు, సిపిఐ( ఎమ్.ఎల్ )రెడ్ స్టార్
9392325652 .
vkolipara 75@gmail.com
