కరేడు భూముల రక్షణ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు , నాయకుల పై పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాము . వారి భూముల రక్షణ కోసమై ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయటమనేది రైతాంగం యొక్క ప్రాథమిక ప్రజాస్వామ్య జీవించే హక్కు. తర తరాలపాటు ఆ భూములపై జీవిస్తున్న రైతులు భూములు ఇవ్వాలా ?లేదా ?అనేది వారి హక్కు. రైతుల యొక్క భూములను కారు చౌకగా , బలవంతముగా బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పటం అధికారంలో ఉన్న పాలకవర్గ పార్టీలకు నిత్యకృత్యమైంది. రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల దేవాదాయ, ధర్మదాయ భూములు, 1973 వ్యవసాయ భూపరిమితి సీలింగ్ చట్టం ప్రకారం తేలిన మిగులు భూములు పేదలకు నేటికీ పంచలేదు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామానికి చెందిన
వెయ్యి ఎకరాల ఉలవపాడు మామిడి తోటలతో సహా, తరతరాలుగా వచ్చిన 8348 ఎకరాల పంట పొలాలను “ఇండోసోలార్ పివీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ” సంస్థకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం . కందుకూరు నుండి గెలిచిన శాసనసభ్యుడు ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవాలి. అలాకాకుండా రైతాంగానికి వ్యతిరేకంగా స్థానిక శాసనసభ్యులు నడుచుకోవటం అన్యాయమైనది.
భూ సేకరణకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయడాన్ని సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్ స్టార్ ఖండిస్తున్నది.శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కరేడు గ్రామ రైతులపై అమానుషంగా పోలీసులు జులుం ను ప్రదర్శించడాన్ని ఖండిస్తున్నాము. పంటలు పండే వ్యవసాయ భూములను సేకరించటాన్ని రైతాంగము ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వెంటనే ఆపాలని, ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. రైతులు,రైతు సంఘాలు, ప్రజలు, ప్రజానాయకులు, ప్రజాస్వామిక వాదులు, భూసేకరణ ప్రక్రియ ను ఆపమని ప్రభుత్వాన్ని కోరుతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్న రైతులు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేసిన వారినందరినీ విడుదల చేయాలని కోరుతున్నాం.
ఇట్లు
మన్నవ హరిప్రసాద్, పోలీస్ బ్యూరో సభ్యుడు సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్
30-6-3025
