అంతర్జాతీయ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినం 139 వ మేడే వర్థిల్లాలి!
కాషాయ కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల కొరకు యావత్ కార్మికలోకం మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలి!
కొల్లిపర వెంకటేశ్వరరావు,సిపిఐ (ఎం.ఎల్ రెడ్) స్టార్ , ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి,
కార్మిక సోదర, సోదరీమణులారా!
2025వ సంవత్సరం మనం 139 వ ‘”మే డే” దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పారిశ్రామిక విప్లవానంతరం ఇంగ్లాండు లోను, అమెరికాలోనూ, ఐరోపా అంతటా , ప్రపంచంలో కార్మికులు యంత్రాల వద్ద బానిసలుగా పనిచేయవలసి వచ్చింది. యజమానులు వారికి ఇష్ట మైనంతసేపు పరిశ్రమల్లో పని చేయించుకుంటూ , చాలీచాలని వేతనాలను లేదా కూలిని కార్మికులకు ఇచ్చేవారు. నిర్దిష్ట పని గంటలు ఉండేవి కావు. ప్రమాదవశాత్తు కార్మికులు పరిశ్రమల్లో చనిపోతే వారికి ఎటువంటి భద్రత ఉండేది కాదు. ఇటువంటి వేతన బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రపంచ కార్మిక వర్గం, ప్రధానంగా ఐరోపా, అమెరికా కార్మిక వర్గం, అనేక ఆందోళనలు, తిరుగుబాట్లు సుదీర్ఘకాలం చేసారు.
19వ శతాబ్దంలో ఈ పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా ఊపొందుకున్నాయి. కార్మికుల అదనపు శ్రమే పెట్టుబడి అని పెట్టుబడి దారుల పెట్టుబడి యొక్క గుట్టును కార్ల్ మార్క్స్ మహాశయుడు తన “దాస్ క్యాపిటల్” గ్రంథం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. కారల్ మార్క్స్, ఎంగెల్స్ మహాశయులు 1848లో అంతర్జాతీయ కమ్యూనిస్టు లీగ్ ఏర్పాటుచేసి కార్మిక వర్గానికి విముక్తి కొరకు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రూపొందించారు. కమ్యూనిస్టు లీగ్ యొక్క స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాల్లో దోపిడీకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. ప్రధానంగా 8 గంటల పని దినం కొరకు ,వేతన బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కొరకు, శ్రమజీవులు అనేక పోరాటాలు చేశారు.
అంతర్జాతీయ కార్మిక సంఘం మద్దతుతో18 86 మే నాలుగో తారీఖున అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్ (గడ్డి మార్కెట్) సెంటర్లో 8 గంటల పని దినం కొరకు కార్మికులు సభ జరుపుకుంటున్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 8 గంటల పని దినం కొరకు ఆందోళనలు సాగుతున్నాయి.
ఈ పోరాటానికి,ఆగస్ట్ స్పీస్,ఆల్బర్ట్ పార్సన్స్,జార్జ్ ఏంగెల్,అడాల్ఫ్ ఫిశ్చర్,లూయిస్ లింగ్,మైకేల్ స్క్వాబ్,ఆస్కార్ నీబె,సామ్యూల్ ఫీల్డెన్ లు నాయకత్వం వహించారు.
హే మార్కెట్ సెంటర్లో కార్మికుల సభ జరుగుతున్న ప్రాంతంలో అకస్మాత్తుగా బాంబు విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో ఏడుగురు పోలీసులు, అనేక మంది కార్మికులు చనిపోవడం క్షత్రగాతులవటం జరిగింది. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో అనేక మంది కార్మికులు చనిపోయారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఆ చికాగో నగర కార్మికుల రక్తంలోనుండి ఉద్భవించినదే ఎర్ర జెండా.
ఈ ఘటనకు 8 మంది కార్మిక నాయకులను అరెస్టు చేశారు. నలుగురు నాయకులను బాధ్యులు చేసి ఉరి తీశారు. మిగతా వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
హే మార్కెట్ ఘటనను ఒక పోరాట స్ఫూర్తి చిహ్నంగా తీసుకొని, పెట్టుబడిదారులకు కార్మిక వర్గానికి జరిగినటువంటి పోరాటానికి చిహ్నంగా, 18 89 లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్టు సంస్థ మే ఒకటో తేదీని ప్రపంచ కార్మిక వర్గ దీక్షా దినంగా పాటించాలని తీర్మానం చేయబడింది. నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మే ఒకటవ తేదీన ప్రపంచ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినంగా సోషలిస్టు వ్యవస్థ సాధనకు ప్రతిజ్ఞ దినంగా పాటిస్తూ వస్తున్నది.
మిత్రులారా! భారతదేశంలో మేడే కార్మిక జెండాను మొట్టమొదటిసారిగా 1923 లో మేడే నాడు మద్రాసు నగరంలో కార్మికుల మధ్య కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడైన కామ్రేడ్ సింగారు వేలు చెట్టియారు నాయకత్వంలో జరిగింది. నాటి నుండ బొంబాయి జౌలి పరిశ్రమల్లోనూ, బొంబాయి, కలకత్తా, మద్రాసు మొదలగు మహానగరాల్లో నావికా కార్మికుల మధ్య , ఆ విధంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో చేస్తున్న కార్మికుల మధ్య శ్రమజీవుల మధ్య ఎర్రజెండాను ఒక పండుగలాగా విప్లవ ప్రతిజ్ఞ దినోత్సవం లాగా కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది.
1990 సంవత్సరం తూర్పు యూరప్ పరిణామాల తర్వాత, సోవియట్ యూనియన్ రష్యాలో కమ్యూనిస్టు పార్టీ దెబ్బతిన్న తర్వాత, అమెరికా సామ్రాజ్యవాది ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏకచత్రాధిపత్యం వహించటానికి ప్రయత్నిస్తున్నాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ( ఎల్. పి .జి) విధానాల ద్వారా భారత పాలకవర్గాలు అమెరికా సామ్రాజ్యవాదులకు అడుగులు మడుగులు వత్తుతున్నాయి.
ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ , అమిత్ షాల నాయకత్వంలో;కాషాయ కార్పోరేటు ఫాసిజాన్ని భారతదేశంలో అమలు చేస్తున్నారు. అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను చట్టాల రూపంలో తీసుకొస్తున్నారు. కాశ్మీరు స్వయంప్రతిప్రత్తినిచ్చే 370 ,35 ఆర్టికల్స్ ను రద్దు చేశారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. ఆ చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో మార్కెటింగ్ చట్టాన్ని మరింత పగడ్బందీగా తీసుకురాబోతున్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. అంబానీ, ఆదాని మొదలగు ఆశ్రిత పెట్టుబడిదారులకు లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశారు. భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదికి జూనియర్ భాగస్వామ్యంగా ఉంటున్నది. పాలస్తీనా విషయంలో కానీ, పొరుగున ఉన్న నేపాల్ విషయంలో కానీ, భారత పాలకవర్గాలు సామ్రాజ్యవాదులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో 139 వ మేడే దినోత్సవాన్ని కార్మిక హక్కుల సాధన కొరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమైక్య పూర్వక పోరాటానికి సిద్ధమవుతామని ప్రతిజ్ఞ తీసుకోవలసిన కర్తవ్యం కార్మిక వర్గం పైన ఉన్నది. ఈ కర్తవ్య సాధనలో దేశ వ్యాప్తంగా సిపిఐ(ఎం.ఎల్) రెడ్ స్టార్ పార్టీ, దాని ప్రజాసంఘాలు ముందు వరసలో ఉంటున్నాయి. కావున యావత్ ప్రజానీకం, కార్మిక వర్గం , తమ ఆర్థిక ,హార్ధిక సహాయ సహకారములు అందించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాము.
1. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి!
2.కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి! 3.ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచవకగా అంబానీ, ఆదానీలకు మొదలగు ఆశ్రిత పెట్టుబడిదారులకు అమ్మటాన్ని ఆపాలి!
4. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీం వర్కర్లను క్రమబద్ధీకరణ చేయాలి!
5. జోహార్ అమరవీరులకు! జోహార్ కామ్రేడ్స్ కొల్లా వెంకయ్య, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి ,చారు ముజందార్ ,కాను సన్యాల్ .
* జోహార్లు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు.!
* జోహార్లు శ్రీకాకుళం పోరాట అమరవీరులకు!
* ప్రపంచ కార్మికులారా మరియు అణగారిన వర్గాల్లారా ఏకంకండి!!
ఇట్లు,
కొల్లిపర వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి,భారత కమ్యూనిస్టు పార్టీ( మార్క్సిస్టు లెనినిస్టు) రెడ్ స్టార్,
93923 25652.
vkollipara@gmail.com
