Home » ప్రపంచ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినం మేడే వర్ధిల్లాలి! ఆర్ఎస్ఎస్ / భాజాపా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరా డండి! భాజపా /ఎన్ డి ఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయండి! – మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్

ప్రపంచ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినం మేడే వర్ధిల్లాలి! ఆర్ఎస్ఎస్ / భాజాపా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరా డండి! భాజపా /ఎన్ డి ఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయండి! – మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్

by admin

ప్రపంచ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినం మేడే వర్ధిల్లాలి!
ఆర్ఎస్ఎస్ / భాజాపా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడండి!
భాజపా /ఎన్ డి ఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయండి!

మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్

పరిశ్రమలు ప్రారంభమైన రోజులలో గ్రామాల నుండి పనులు కోల్పోయిన వారు పట్టణాలకు వలస వచ్చి  పరిశ్రమలలో పనిచేసేవారు. పరిశ్రమల  యజమానులు, పెట్టుబడిదారులు కార్మికులతో
14 గంటలు 16 గంటలు కూడా పని చేయించుకునేవారు. చాలీచాలని వేతనాలు ఇచ్చేవారు. పని భద్రత ఉండేది కాదు. పరిశ్రమల్లో పనిచేసే వారికి ప్రమాదాలు జరిగితే  యజమానులు పట్టించుకునేవారు కాదు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి . పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో, వివిధ దేశాలలో పరిశ్రమలలోనూ కూడా  కార్మికుల పరిస్థితి ఇదే విధంగా ఉండేది. కార్మికులు బాధలను భరించలేక సమ్మెలనుచేయటం ప్రారంభించారు. సమ్మె అనే ఆయుధం తప్ప కార్మిక వర్గానికి మరొక మార్గం  లేదు. సమ్మెలు చేసే కార్మిక వర్గాన్ని చితక బాదేవారు. నానా రకాలుగా హింసించేవారు. ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులకుఅనుకూలంగా ఉండేవి.
ప్రపంచ కార్మిక వర్గానికి మార్క్స్ ఎంగిల్స్ మహాశయులు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను అందించారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండని పిలుపునిచ్చారు.శ్రమ దోపిడి  ద్వారా పెట్టుబడి పోగై అదనపు విలువ సిద్ధాంతం  అందించారు. 1917లో లెనిన్ మహాశయుని  నాయకత్వంలో రష్యాలో సోషలిస్టు మహా విప్లవం జరిగింది. 1949లో చైనాలో  జనచైనా ఏర్పడింది. దోపిడీ రహిత సమాజం కోసం ప్రపంచ కార్మిక వర్గం  ఉవ్వెత్తున ఉద్యమించింది.

ఇలాంటి పరిస్థితి అమెరికా దేశంలో కూడా ఉన్నది. ఇలాంటి  దుర్భర పరిస్థితులను భరించలేక అమెరికాలోని కార్మికులు సమ్మె చేయటం ప్రారంభించారు. 8 గంటల పని దినం కోసం, వేతన బానిస వ్యవస్థ నిర్మూలన కోసం, కార్మిక హక్కుల కోసం 1886 మే నెలలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెలు చేశారు. వారి పని దినాన్ని 8 గంటలకు తగ్గించాలని  ప్రధాన డిమాండ్ గా ఉద్యమం సాగింది.

చికాగో నగరంలోని గడ్డి మార్కెట్ సెంటర్లో  కార్మికులు పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నారు. ఆ సభ పైన అమెరికా పెట్టుబడిదారీ ప్రభుత్వ పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వందలాది మంది గాయపడ్డారు. నలుగురు కార్మికులు చనిపోయారు. ఏడుగురు పోలీసులు కూడా ఆ ఘర్షణలో చనిపోయారు. ఆ ప్రాంతమంతా రక్తపాతమైపోయింది.   చికాగో నగర కార్మికుల రక్తం నుంచి  ఉద్భవించినదే ఎర్రజెండా.  నాటి,నుండి  నేటి వరకు కార్మిక  వర్గ చిహ్నంగా ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా  కార్మికుల చిహ్నం అయింది.

ఆ ఉద్యమానికి *ఆగస్టు  స్పైస్, ఆల్బర్ట్ పార్సన్స్, సామ్యూల్ ఫీల్డెన్,  అడాల్ఫ్
ఫిశ్చర్, జార్జ్ ఎంగిల్, మైఖేల్ స్క్వాబ్, లూయిస్ లింగ్, ఆస్కార్  నీబే*  నాయకత్వం వహించారు. 8 మంది నాయకుల్లో నలుగురకు మరణ శిక్ష విధించారు. మిగతా వారికి యావజీవ కారాగార శిక్ష విధించారు.
1889వ  సంవత్సరం  అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య, ట్రేడ్ యూనియన్ సంఘాలు  సమావేశమై*మే ఒకటవ తేదీన* అంతర్జాతీయ విప్లవ కార్మిక వర్గ దీక్షా దినంగా  ప్రపంచవ్యాప్తంగా పాటించాలని నిర్ణయించింది.

ప్రపంచ కార్మిక వర్గంలో భాగంగా భారతదేశంలో కూడా 1923 మే ఒకటవ తారీఖున మద్రాసు నగరంలో సింగార వేలు చెట్టియార్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఎర్రజెండా ఎగురవేశారు.  బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా  భారతదేశ కార్మిక వర్గం  మహత్తరమైన పాత్ర నిర్వహించింది. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు చేసి 8 గంటల పని దినముతో పాటు అనేక హక్కులను, చట్టాలను కార్మిక వర్గం సాధించుకున్నది.

గతపది సంవత్సరాల  నుండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ )నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అనేక ప్రజా వ్యతిరేక విధానాలను  అమలు చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)  1925 వ సంవత్సరంలో స్థాపించబడినటువంటి  హిందూ మతోన్మాద ఫాసిస్టు  సంస్థ. ప్రజల  మత విశ్వాసాలను  కమ్యూనిస్టులు, కార్మికులు ఎప్పుడూ గౌరవిస్తారు. కానీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి  అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి హిందువులకు ముస్లింలకు మధ్య వైరుధ్యాలను ప్రేరేపించి ఆ వైరుధ్యాలను పెంచి పెద్ద చేసి భారతదేశాన్ని హిందూ మత రాజ్యంగా స్థాపించాలనేది దాని  లక్ష్యం. అందుకు అనుగుణంగా ఇస్లాము ఫోబియోను, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టిచున్నది.  గత 75 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక వర్గ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులను, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించి  పోరాడిన వారిని  యుఏపీఏ( ఉపా )లాంటి నల్ల చట్టాలను పెట్టి జైల్లలో సంవత్సరాల తరబడి  నిర్బంధించుచున్నది . డిమానిటైజేషన్ పేరుతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు బ్యాంకు రుణాలు రద్దు చేసింది.

విమానాలు, రైల్వేలు, నౌకాశ్రయాలు, రోడ్లు ,ఎల్ఐసి, విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు, మొత్తం జాతి సంపదను అంబానీ ఆదాని లాంటి ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారులకు  కారు చౌకగా అప్పజెప్పిచున్నది. లక్షలాది కోట్ల రూపాయల విదేశీ స్వదేశీ అప్పుతోటి ప్రజల జీవన ప్రమాణాలను దిగ జార్చుచున్నది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సగటు మానవుడి జీవితం దుర్భరమైంది. మోడీ అధికారంలో రాకముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు.

మన రాష్ట్ర పరిస్థితికి వచ్చినట్లయితే బహుళార్థ సాధక  పోలవరం ప్రాజెక్టు  అటకెక్కింది. అమరావతి రాజధాని అల్లరి పాలయ్యింది. విశాఖ రైల్వే జోను ఊసే లేదు.రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు  కేంద్రంలోని భాజపా ఎన్డీఏ ప్రభుత్వానికి అడుగులుకు మడుగులు వత్తుతున్నాయి. తమ మాట వినని ప్రాంతీయ పార్టీలను  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు,(ఈడి),  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ ), ఇన్కమ్ టాక్స్ లాంటి సంస్థలను ఉపయోగించి  ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకుంటున్నది. ఈనాడు మనం క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం. ఇటువంటి ప పరిస్థితులో ప్రజాప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులు పైన, విప్లవకారుల పైన, వామ పక్ష, విప్లవ ప్రజాతంత్ర  శక్తులపై ఉన్నది. కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ  అధికారం  వెలగబెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ కూటమిని ఓడించి  భారత ప్రజాస్వామిక రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను కాపాడవలసిందిగా, ఈ  ఈ 138వ మేడే సందర్భంగా మనం ప్రతిన ప్రతినబూనుదాం! 18వ లోకసభ ఎన్నికలలో భాజపా ఎన్డీఏ కూటమి  వ్యతిరేకంగా  ఓటు వేయవలసిందిగా కార్మిక వర్గానికి సిపిఐ (ఎమ్ ఎల్ )రెడ్ స్టార్ విజ్ఞప్తి చేస్తున్నది.

మన్నవ హరిప్రసాద్ , పొలిట్ బ్యూరో సభ్యుడు సిపిఐ( ఎం.ఎల్ )రెడ్ స్టార్.
మొబైల్ నెంబర్ :9346508846
email :mannavahariprasad@gmail.com
27-4-2024

Related Posts

Leave a Comment