విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటుకు 22 వేల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను దోచిపెట్టటాన్ని ఖండించండి!
మన్నవ హరిప్రసాద్ పొలిట్ బ్యూరో సభ్యుడు, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్,
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం పేరుతో ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనేక మినహాయింపులతో శంకుస్థాపన కార్యక్రమం సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చేయటం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ రావడంతో నవ్యాంధ్రప్రదేశ్లో అనేక అనుబంధ సాఫ్ట్ వేర్ పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊదరగొడుతున్నారు. మోడీ- బాబు- పవన్ ఒకరిని మరొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వ యొక్క కార్పొరేట్ దాసోహం ను, అమెరికా సంస్థ అయిన గూగుల్ కు దాసోహం అనటాన్ని తెలియజేస్తున్నది. 22 వేల కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ మినహాయింపుల ద్వారా అమెరికా గూగుల్ కు ఇస్తున్నది . ఈ గూగుల్ కంపెనీలో భాజపా క్రోనీ క్యాపిటలిస్ట్ అయిన ఆదాని కూడా భాగస్వామి అని తెలిసినది.ఆంధ్రప్రదేశ్‌ను గూగుల్, అదానీలకు అమ్మివేతను రాష్ట్ర ప్రజానీకం తిరస్కరించాలి!
“అభివృద్ధి” అనే ముసుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను గూగుల్, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాల చేతికి అప్పగించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి, భాజపా, జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తీవ్రంగా ఖండించాలి. విశాఖపట్నంలో ₹87,520 కోట్ల విలువైన “గూగుల్ డేటా సెంటర్” అని ప్రకటించిన ప్రాజెక్ట్ ప్రజల విజయం కాదు — ఇది కార్పొరేట్ దాస్యానికి ప్రతీక, ప్రజా సంపదను దోచుకునే ఘోర చర్య.
“డిజిటల్ ఆంధ్ర” అనే ప్రచార హోరులో దాగి ఉన్న నిజం — కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు, భూసబ్సిడీలు, విద్యుత్ రాయితీలు, నాయుడు ప్రభుత్వం 480 ఎకరాల భూమిని 25% తక్కువ ధరకు ఇవ్వడం, విద్యుత్ సుంక మినహాయింపు, 15 సంవత్సరాల విద్యుత్ సబ్సిడీలు, మరియు నిర్మాణ దశలో 100% SGST రీఇంబర్స్‌మెంట్ — ఇవన్నీ కలిపి ₹22,000 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని ఇప్పటికే కోట్ల లాభాలు పొందుతున్న అంతర్జాతీయ కంపెనీకి బహుమతిగా ఇవ్వడం జరిగినది. ఇది అమెరికా సామ్రాజ్యవాదులకు భారత భారత వర్గాలు జూనియర్ భాగస్వామిగా దాసోహం అనటంలో భాగమే.
సుమారు ₹10 లక్షల కోట్లు అప్పులో మునిగిపోయిన రాష్ట్రం — దేశంలోనే అత్యధిక ఆదాయ లోటుతో ఉన్న రాష్ట్రం — ఇంతటి భారీ సబ్సిడీలు విదేశీ మూలధనానికి ఇవ్వడాన్ని కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్పగలదు? రాయలసీమ రైతులు నీటి కొరతతో పోరాడుతుండగా, ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీలు బహిష్కరణకు గురవుతుండగా, గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ(AI) డేటా సెంటర్ రోజూ లక్షల లీటర్ల నీటిని యంత్రాలను చల్లబరచడానికి వృథా చేస్తుంది. ఈ గూగుల్ సెంటర్ ను పర్యావరణానికి విఘాతం కలిగిస్తుందని అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పే “స్మార్ట్ డెవలప్మెంట్” — ప్రజల సంక్షేమం, పర్యావరణాన్ని కార్పొరేట్ దాహానికి బలి చేయడం.
కావున ప్రజలుఈ టిడిపి పాలన, మోదీ ప్రభుత్వం, అదానీ వంటి దోపిడీదారుల మధ్య ఉన్న ప్రమాదకరమైన మైత్రిని అర్థం చేసుకోవాలి. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ బీజేపీ–టిడిపి – జనసేన కూటమి ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల రాజకీయాలకు చిహ్నం. ప్రజా మౌలిక సదుపాయాలు, ఉపాధి, గ్రామీణాభివృద్ధిని బలపరచాల్సిన స్థితిలో, వారు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలుగా కోసి బహుళజాతి కంపెనీలకు అమ్మేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్, అదానీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని అన్ని వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని, అన్ని రకాల సబ్సిడీలు, భూమి బదిలీలను నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వనరులు ప్రజల సొత్తు — లాభాల కోసం తహతహలాడే కంపెనీల సొత్తు కావు.
ఇట్టి పరిస్థితుల్లో కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువతను ఈ ద్రోహానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి పిలుస్తున్నది. మన భూమి, నీరు, వనరులను కార్పొరేట్ దోపిడీదారుల చెర నుండి తిరిగి సాధించడానికి ప్రజా ఉద్యమం నిర్మిద్దాం.
కార్పొరేట్ దోపిడీ నశించాలి !!
చంద్రబాబు నాయుడు యొక్క కార్పొరేట్ అనుకూల కూటమి పాలన నశించాలి !!
ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి !!
మన్నవ హరిప్రసాద్, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్. పొలిట్ బ్యూరో సభ్యుడు,
82477 28296,
mannavahariprasad@gmail.com
