నేపాల్ పరిణామాలుపై- సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్
అంతర్జాతీయ విభాగం, సిపిఐ-(ఎం.ఎల్) రెడ్ స్టార్
సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 7న నేపాల్‌లో విద్యార్థులు ప్రారంభించిన “జనరేషన్-జెడ్” నిరసనలు, కేవలం రెండు రోజుల్లోనే హింసాత్మక ఆందోళనగా మారాయి. షర్మా ఓలీ ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతి మరియు అణచివేతపై ప్రజల్లో విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో, రాజకీయ పార్టీలు వాటిపై నిస్సిగ్గుగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం పెంచింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల నిషేధానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం అకస్మాత్తుగా ఊహించని హింసకు దారితీసింది, ఫలితంగా “ఓలీ ప్రభుత్వం” రాజీనామా చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 8 సాయంత్రానికి సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ, నిరసనకారులు అనేక ప్రభుత్వ భవనాలను చుట్టుముట్టారు. పార్లమెంటుతో పాటు ప్రముఖుల అధికారిక నివాసాలకు కూడా నిప్పు పెట్టారు. ఇది వారి రాజకీయ వైఖరి, అనుబంధాలతో సంబంధం లేకుండా ఉన్నత స్థాయి నాయకుల ఇళ్లకు కూడా విస్తరించింది.
నేపాల్ సైన్యం ఆలస్యంగా జోక్యం చేసుకొని, భద్రతా బాధ్యతలు స్వీకరించినా, దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించినా, కర్ఫ్యూ ప్రకటించినా, సైనిక సిబ్బంది వీధుల్లో గస్తీ కాస్తున్నా, శాంతియుత రాజకీయ చర్చల కోసం సైన్యం, పోలీసులు, ఉన్నతాధికారులు సంయుక్తంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, పరిస్థితి అస్థిరంగా ఉంది. దేశ భవిష్యత్ నాయకత్వంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, నేపాల్ అధ్యక్షుడు పౌడెల్ రాజకీయ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం “జనరేషన్-జెడ్” నిరసనకారులతో పాటు నేపాల్ సైన్యంతో సమావేశం కానున్నారు.
ఈలోగా, పాలకవర్గ పార్టీలే కాకుండా, మాజీ మావోయిస్టులతో సహా, ప్రధాన స్రవంతిలోని వామపక్షాలు కూడా నయా ఉదారవాద, రాజకీయాలను వీడిన, అవినీతిమయమైన, దిశానిర్దేశం కోల్పోయిన వర్గాలుగా మారాయి. ప్రస్తుతం జరుగుతున్న పోరాటానికి ప్రధానంగా విద్యార్థులు, పట్టణ యువత నాయకత్వం వహిస్తున్నప్పటికీ, శ్రామిక, గ్రామీణ ప్రజలు ఇందులో పెద్దగా లేరు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, “జనరేషన్-జెడ్” నిరసనకారులు అవినీతి, పాలకుల రాజకీయ ఉదాసీనతపై పోరాడటం ప్రశంసనీయం అయినప్పటికీ, వారు తీవ్ర-దక్షిణ నయా ఉదారవాద విధానాలకు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ఇంకా ముందుకు తీసుకురాలేదు.
పరిస్థితి ఇంకా అనిశ్చితిగా ఉన్నందున, ఉద్భవిస్తున్న ప్రత్యామ్నాయాల గురించి నివేదికలు భవిష్యత్తుకు శుభసూచకంగా లేవు. ఉదాహరణకు, వారిలో ఒక ప్రముఖ వ్యక్తి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP)కి చెందిన రబి లామిచానే. అతని రాజరిక అనుకూల, భారత అనుకూల వైఖరి స్వయంగా స్పష్టంగా కనిపిస్తోంది. 21 మంది ఎంపీలతో అతని పార్టీ రాజీనామా చేయడం కూడా రాజకీయ అస్థిరతను సృష్టించడానికి ఒక వ్యూహాత్మక చర్య. ఇప్పుడు, లామిచానే నేపాల్ యువత, విద్యార్థులు, పట్టణ వృత్తినిపుణుల్లో విస్తృతంగా ఉన్న నిరాశను తన వైపుకు మలుచుకుంటున్నారు. “జనరేషన్-జెడ్”కి బలమైన మద్దతుదారు, అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఖాట్మండు మేయర్ బలేంద్ర కూడా, నేటి అవినీతికి మూలమైన నయా ఉదారవాదాన్ని సమర్థిస్తున్నారు. నివేదికల ప్రకారం, మాజీ ప్రధానమంత్రి బాబురామ్ భట్టారాయ్ కూడా తాత్కాలిక ఏర్పాట్ల గురించి చర్చల్లోకి వచ్చారు. జనమత్ పార్టీ నేపాల్, నాగరిక్ ఉన్ముక్తి పార్టీ మరియు కొంతమంది స్వతంత్రులు కూడా ఈ పోరాటంలో ఉన్నారు.
అయితే, నేపాల్‌లోని యువ తరంలో విస్తరించిన అసంతృప్తిని ఆసరాగా చేసుకుంటున్న పై పేర్కొన్న వివిధ శక్తులు, నేపాల్ ఈరోజు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఒక సరైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ముందుకు తీసుకురాలేదు. దక్షిణ ఆసియాలోని ఇతర దేశాలలో జరిగినట్లే, ప్రజలు పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ, ప్రజల రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడంతో, నేపాల్‌లో కూడా అంతర్జాతీయ నయా ఉదారవాద-నయా ఫాసిస్ట్ కేంద్రాలు, దేశీయ ప్రతిచర్య మరియు రాచరిక అనుకూల శక్తులతో కలిసి ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. నేపాల్‌లో పునరావృతమవుతున్న రాజకీయ సంక్షోభాలు, దేశీయ ప్రతిచర్య పాలక వర్గాలకు, బాహ్య నయా ఉదారవాద కార్పొరేటిజం శక్తులకు మధ్య ఉన్న అపవిత్ర బంధానికి వ్యతిరేకంగా ఒక వామపక్ష-ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
అంతర్జాతీయ విభాగం, సిపిఐ(ఎంఎల్) రెడ్ స్టార్
న్యూఢిల్లీ,
10-9-2025
